Wednesday 22 August 2012

సినిమా వాకిట్లో "సిరివెన్నెల" చెట్టు




"ఎవరో ఒకరు, ఎపుడో అపుడు, నడవరా ముందుకు, అటో ఇటో ఎటో వైపు.
మొదటి అడుగు ఎప్పుదూ ఒంటరే మరి, వెనకవచ్చు వారికి బాట ఐనది."

                                      ~ సిరివెన్నెల సీతారామ శాస్త్రి.



తెలుగు సినీ సంగీత చరిత్ర లో సాహిత్యం ఒకే తాటి పై వెళుతున్న రోజుల్లో పదానికి కొత్త ప్రవాహాన్ని ప్రసాదించాడు ఆ ఒక్కడు, బాట సృష్టించాడు.
చెంబోలు సీతారామశాస్త్రి నుండి "సిరివెన్నల" సీతారామశాస్త్రి వరకు సాగిన అతని ప్రయాణం అమోఘం, అద్వితీయం.  

విశ్వనాథుని  "సిరివెన్నెల" తో ప్రేక్షకుల హృదయాల్లో మల్లెల వర్షం కురిపించారు ఆయన.
" ఆది బిక్షువు వాడినేమి అడిగేది,
  బూడిద్దిచ్చే వాడినేమి కోరేది.
  తీపి రాగాల ఆ కోకిలమ్మకు నల్ల రంగునలమిన వాడినేమి కోరేది. "

అని శంకరుని ఎవరూ కొలచని విధంగా కొనియాడి ఆశ్చర్యపరిచినా,

"  చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, గోగు పూలు తేవే" 
అని ప్రతి తల్లి నోటా తన పాట పలికించినా, అది సిరివెన్నెల కే సాధ్యం. 


"చేరి యశోదకు శిశువితడు, తారుని బ్రహ్మకు దండ్రియు నితడు" 
అని స్వర్ణ కమలం లో రాసిన పలుకులు మరువలేనివి. 



"రామబాణం ఆపిందా రావణ కాష్టాన్ని,
కృష్ణ గీత ఆపిందా, నిత్య కురుక్షేత్రాన్ని"
అని సమాజపు దుస్థితి ని వివరిస్తుంటే తెరుచుకోని కన్నుండదు.


శుభలగ్నం
సినిమా లో "లాభం ఎంత వచ్చిందమ్మా, మాంగల్యం అమ్మాక" అని అంటుంటే పద పదనిసలకు ఆశ్చర్య పోవడం ప్రజల వంతైంది.


క్షణ క్షణం- రాము తీసిన ఈ
సినిమా అనుక్షణం మనని భయపెడుతూ, అడవి సన్నివేశాలు అదిరిపోయేలా వస్తుంటే,
"జాము రాతిరి జాబిలమ్మ" అంటూ శ్రీదేవి అందాలను కళ్ళకు కట్టిన వైనం అధ్బుతం.



మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సిరివెన్నెల గారిని ఉదేశిస్తూ “ఒకరోజు నేను సింధూరం సినిమా కి వెళ్లాను. సినిమా మొత్తం అయిపోయాక ఏదో అసంతృప్తి. ఆ సమయం లో ‘అర్ధశతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్ర్యమందామ’ అని సిరివెన్నెల గారు రాసిన మాటలు విని రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ అలా అలా వెళ్ళిపోయా. ఎక్కడికి వెళ్తున్నానో కూడా తెలీదు. ఆయన అర్దరాత్రి ఉదయించే సూర్యుడు” అని ప్రశంసించారు.


ఆయన రాసే పాటలకి పసివాడి హృదయం కూడా పరువళ్ళు తోక్కుతున్దంటే అతిశయోక్తి కాదు. తన కలం నుండి జాలువారిన ప్రతి అక్షరం తెలుగు సినీ ప్రస్థానాన్ని మార్చివేసే తూటాలు.  సిరివెన్నెల గారు తాకని భావమంటూ లేదు. శృంగార రసం లో తను పలికించిన పలుకులు కుర్రాళ్ళ గుండెల్లో జలపాతాలని పొంగింపజేసాయి.  దానికి ఉదాహరనే-
“అందించని అదిరే ఆధారంజలి. బంధించని కాలాన్నే కౌగిలి”.

చక్రం సినిమా లోని  “జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది” అనే పాట కి పరిచయాలు అవసరం లేదు. సినిమా ల కోసం పాటలు రాయడం సహజం. కాని పాట విని సినిమా తీయడం ఒక్క సిరివెన్నల సాహిత్యానికే సాధ్యం.

నువ్వొస్తానంటే లో ఘల్ ఘల్ పాట లో “జన్మంతా నీ అడుగుల్లో అడుగులు వేసే జత ఉంటే, నడకల్లో తడబాటైన నాట్యం అయిపోదా” అని ప్రేమ ని కృషి తో జతపరిచి తను రాసిన పాట ప్రతి ఒక్కరిని మల్లి సంగీతం వైపు చూసేలా చేసింది.

సిరివెన్నెల గారి అమ్ముల పొదగు లో ఒదిగిన ఇలాంటి మాటల అస్త్రాలు ఎన్నో, మరెన్నో… అందులో కొన్ని-
“ఎంతవరకు ఎందుకొరకు” ~ గమ్యం
“తరలి రాద తనే వసంతం” ~ రుద్రవీణ
“దేవుడు కరునిస్తాడని” ~ ప్రేమ కథ
“నీ ప్రశ్నలు నీవే” ~ కొత్త బంగారు లోకం
“ఇందిరమ్మ ఇంటిపేరు” ~ మహాత్మ

అనంత తన పాటల విశ్వాన్ని వర్ణించడం అసాధ్యం. ఏదైనా మరచి ఉంటే మన్నించండి.
10 నంది పురస్కారాలకు వన్నె తెచ్చిన సిరివెన్నల గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ ఇక సెలవు.

                 - VIVEK
 ______________________________________________________________________________

ఈ తెలుగు పాట కాదా నిండు జాబిల్లి వెన్నెల, సాహిత్యము కూర్చగా ఈ సిరివెన్నెల.

కన్నీటిని మోసుకుంటూ పదము పై నీవు, కన్నె ఈడుని కవ్విస్తూ కన్నవై నీవు.
నీతులెన్నో నేర్పిన గురువు గా నీవు, భీతుల్లెన్నో తరిమేస్తూ మరపుగా నీవు.
స్వరములో నీవు, సరళమే నీవు, శక్తి అందు నీవు ,సాగరం నీవు.
కలలోను నీ గేయం, కళ అంటే నీ గేయం, కలవరింత నీ గేయం, కల్ల కాదు నీ గేయం.
జగమంతయు నీ పాటే, జాగృతిఅయి నీ పాటే, జనము నోట నీ పాటే, జయము తెలుప నీ పాటే.
సాపాటుకైన నీ పాటే, సరి సాటి లేని నీ పాటే, సామాన్యునికి నీ పాటే, సర్వోత్తమునికి నీ పాటే.

  ~ YRK

 
 

Friday 22 June 2012

నీ కోసం





నే వింటున్నాననుకున్నా నీ మాటలు,
తీరా చూస్తే అవి చిలకమ్మ పాటలు,

నే చుస్తున్నాననుకున్నా నీ కళ్ళను,
ఆరా తీస్తే అది సెలయేటి కొలను,

నే పొందుతున్నాననుకున్నా నీ స్పర్శ,
కాని అది నెమల్లు నాకిస్తున్న పరామర్శ,

నువ్వు నా వైపు వేస్తున్న అడుగులు,
అంటున్నాయి ద్రుష్టి మరలించవద్దని,

అనుకున్నా నా పక్కన కూర్చున్నది నువ్వేనని,
తెలుసుకున్నా అది అద్దం లో నా ప్రతిబింబమని,

అనుకున్నా నువ్వంటే నేనేనని,
తెలుసుకున్నా నువ్వున్నది నాలోనే అని. 


Monday 4 June 2012

ప్రేమ లేఖ



ప్రియమైన నీకు,

               నీ క్షేమం గురించి అడగటం హాస్యాస్పదం. ఎందుకంటే ఈ చదువుల కారణంగా మనం విడిపోయిన దగ్గరనుండి 
              నా పెదవికి ఒకటే ఆలాపన- నువ్వు,   
              నా కనులకు ఒకటే ఆలోచన- నీ చిరునవ్వు,
              నా మనసుకి ఒకటే ఆవేదన- దూరమవుతున్న మన స్నేహం.
కాబట్టి నాకు తెలుసు నువ్వు క్షేమమేనని. ఈ లేఖ నీకు రాయడానికి కారణం- ఓ కల. అందమైన ఆ కల కలవరపరిచింది నా హృదయాన్ని, రచింపజేసింది ఈ లేఖను.

           ఆ కలలోని ప్రతి ఒక్క అంశం స్పష్టంగా నా కనులముందే మెలుగుతుంది. ఎందుకంటే ప్రతి కలలాగ ఇది కేవలం పద్ధతి లేకుండా జరిగే సంఘటనల మేళవింపు మాత్రమే కాదు. ఈ కల ప్రకృతి తన చేతిలోని కుంచె తో గీసిన అధ్బుత చిత్రం.
           
         " ఆకాశం తో పాటు భూమి ని కప్పివేసిన తమస్సు, నిశబ్దాన్ని మరింత భయంకరంగా మారుస్తున్న పిల్ల గాలులు, వీటి నడుమ నే  వేచివున్నా. ఎందుకొరకో తెలీదు, ఎవరికోసమో తెలీదు. కాని ఆ నిరీక్షణ ఎంతో మధురంగా అనిపించింది. వెండి వెన్నెలలను విరజిమ్ముతున్న చంద్రుడు, అనంత చీకట్లను నెలగోల్పుతున్న తమస్సు, నన్ను ఆకర్షించాడానికై పోటీ పడుతున్నాయ్. అంత లో వర్షం. ఇది మాములు వర్షం కాదు. పూల  వాన  . ఆ  కొద్ది  సేపట్లో పూరెక్కల వెచ్చని స్పర్శకు కరిగిన నా చెక్కిళ్ళు. అంతా ఆనందంగా గడిచిపోతున్న సమయం లో కంపించింది నా కాళ్ళ కింది భూమి. పాతాళం లో కి కూరుకుపోయింది నా దేహం." అంతే ఉలిక్కిపడి నిద్రలేచాను. అదే నా కల. ప్రకృతి గురించి కలగన్నాను, తమచ్చాయల తకదిమల గురించి కలగన్నాను, పూరెక్కల పదనిసల గురించి కలగన్నాను. అంటే- నీ గురించి కలగన్నాను.
     
       ఈ అర్ధం లేని సంఘటనలు, నీ గురించి కల ఎలా అవుతుందో నీకు అర్ధం కాలేదు  కదు . నే వివరిస్తాను-

       " అరకు లోయల సోయగాలను ఆస్వదిస్తూ నేను వేచివున్నాను. కనులకు ఆనందం కలిగించే అధ్బుత సృష్టి అయిన అరకు లో నా మనసుకి ఆనందం కలిగించే నీ కోసం నిరీక్షిస్తూ వున్నా. నా కలలోని తమస్సులు నీ కురులైతే, పిల్ల గాలి సంబరాలు నీ చిరునవ్వులు. ఆ నవ్వులకు ఒక్క క్షణం నిలిచిపోయింది నా హృదయ స్పందన! నన్ను ఆకర్షించడానికి తమస్సు(నీ కురులు) ల తో పోటిపడిన వెండి  వెన్నెలలు మరేమిటో కాదు- చంద్రబింబము వంటి నీ ముఖము. నా చెక్కిళ్ళను కరిగించిన ఆ పూరెక్కలు, నీ మధుర అధరాలు. నన్ను పాతాళం(నీ హృదయం) లోకి  తీసుకెళ్ళిన ఆ భుకంపమే- ప్రేమ. నేను కలగన్నది నీ గురించి కాదు. నా ప్రేమ గురించి. 

       మన జీవితాలను ఏకం చేసే నీ మధురమైన జవాబు కొరకు ఎదురుచూస్తుంది నీదైన నా హృదయం. 
                                                                                                                                                                                  ఇట్లు,                                                                                                                                                                            నీ ఆర్య.