Monday, 4 June 2012

ప్రేమ లేఖ



ప్రియమైన నీకు,

               నీ క్షేమం గురించి అడగటం హాస్యాస్పదం. ఎందుకంటే ఈ చదువుల కారణంగా మనం విడిపోయిన దగ్గరనుండి 
              నా పెదవికి ఒకటే ఆలాపన- నువ్వు,   
              నా కనులకు ఒకటే ఆలోచన- నీ చిరునవ్వు,
              నా మనసుకి ఒకటే ఆవేదన- దూరమవుతున్న మన స్నేహం.
కాబట్టి నాకు తెలుసు నువ్వు క్షేమమేనని. ఈ లేఖ నీకు రాయడానికి కారణం- ఓ కల. అందమైన ఆ కల కలవరపరిచింది నా హృదయాన్ని, రచింపజేసింది ఈ లేఖను.

           ఆ కలలోని ప్రతి ఒక్క అంశం స్పష్టంగా నా కనులముందే మెలుగుతుంది. ఎందుకంటే ప్రతి కలలాగ ఇది కేవలం పద్ధతి లేకుండా జరిగే సంఘటనల మేళవింపు మాత్రమే కాదు. ఈ కల ప్రకృతి తన చేతిలోని కుంచె తో గీసిన అధ్బుత చిత్రం.
           
         " ఆకాశం తో పాటు భూమి ని కప్పివేసిన తమస్సు, నిశబ్దాన్ని మరింత భయంకరంగా మారుస్తున్న పిల్ల గాలులు, వీటి నడుమ నే  వేచివున్నా. ఎందుకొరకో తెలీదు, ఎవరికోసమో తెలీదు. కాని ఆ నిరీక్షణ ఎంతో మధురంగా అనిపించింది. వెండి వెన్నెలలను విరజిమ్ముతున్న చంద్రుడు, అనంత చీకట్లను నెలగోల్పుతున్న తమస్సు, నన్ను ఆకర్షించాడానికై పోటీ పడుతున్నాయ్. అంత లో వర్షం. ఇది మాములు వర్షం కాదు. పూల  వాన  . ఆ  కొద్ది  సేపట్లో పూరెక్కల వెచ్చని స్పర్శకు కరిగిన నా చెక్కిళ్ళు. అంతా ఆనందంగా గడిచిపోతున్న సమయం లో కంపించింది నా కాళ్ళ కింది భూమి. పాతాళం లో కి కూరుకుపోయింది నా దేహం." అంతే ఉలిక్కిపడి నిద్రలేచాను. అదే నా కల. ప్రకృతి గురించి కలగన్నాను, తమచ్చాయల తకదిమల గురించి కలగన్నాను, పూరెక్కల పదనిసల గురించి కలగన్నాను. అంటే- నీ గురించి కలగన్నాను.
     
       ఈ అర్ధం లేని సంఘటనలు, నీ గురించి కల ఎలా అవుతుందో నీకు అర్ధం కాలేదు  కదు . నే వివరిస్తాను-

       " అరకు లోయల సోయగాలను ఆస్వదిస్తూ నేను వేచివున్నాను. కనులకు ఆనందం కలిగించే అధ్బుత సృష్టి అయిన అరకు లో నా మనసుకి ఆనందం కలిగించే నీ కోసం నిరీక్షిస్తూ వున్నా. నా కలలోని తమస్సులు నీ కురులైతే, పిల్ల గాలి సంబరాలు నీ చిరునవ్వులు. ఆ నవ్వులకు ఒక్క క్షణం నిలిచిపోయింది నా హృదయ స్పందన! నన్ను ఆకర్షించడానికి తమస్సు(నీ కురులు) ల తో పోటిపడిన వెండి  వెన్నెలలు మరేమిటో కాదు- చంద్రబింబము వంటి నీ ముఖము. నా చెక్కిళ్ళను కరిగించిన ఆ పూరెక్కలు, నీ మధుర అధరాలు. నన్ను పాతాళం(నీ హృదయం) లోకి  తీసుకెళ్ళిన ఆ భుకంపమే- ప్రేమ. నేను కలగన్నది నీ గురించి కాదు. నా ప్రేమ గురించి. 

       మన జీవితాలను ఏకం చేసే నీ మధురమైన జవాబు కొరకు ఎదురుచూస్తుంది నీదైన నా హృదయం. 
                                                                                                                                                                                  ఇట్లు,                                                                                                                                                                            నీ ఆర్య.
    

              

2 comments: